14 March 2020

మౌలానా మజారుల్ హక్ Maulana Mazharul Haque 1866-1930



   Image result for Maulana Mazharul Haque 

సంపూర్ణ స్వాతంత్ర్యo "ప్రతి దేశం యొక్క జన్మహక్కు" అని గట్టిగా నమ్మిన గొప్ప దేశ భక్తుడు  మౌలానా మజారుల్ హక్.

మౌలానా మజారుల్ హక్ 1866 డిసెంబర్ 22 న పాట్నా జిల్లాలోని థానా బిహ్తా (Bihta) లోని బహపురాలో ధనిక భూస్వామి షేక్ అహ్మదుల్లాకు జన్మించారు. ప్రాథమిక విద్య మౌల్వి సజ్జాద్ హుస్సేన్ దగ్గిర పొంది 1886 లో పాట్నా కాలేజియేట్ నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యారు. పిదప ఉన్నత చదువుల కోసం లక్నోలోని కన్నింగ్ కాలేజీలో చేరారు కాని అదే సంవత్సరం ఇంగ్లాండ్‌కు లా కోర్సు కోసం వెళ్లారు. 1891 లో ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత పాట్నాలో న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు.

1897 లో బీహార్‌లోని సరన్ జిల్లాలో కరువు సమయంలో ప్రారంభించిన సహాయక చర్యలలో  గణనీయమైన సేవ  చేశారు. మౌలానా మజారుల్ హక్ యొక్క ప్రజా జీవితం బీహార్ ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్ ఏర్పాటుతో ప్రారంభమైంది. ప్రత్యేక ప్రావిన్స్‌ గా బీహార్ కు రాజ్యాంగం అవసరo ఆయన విశ్వసించారు.

1906 లో మౌలానా బీహార్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మజారుల్ హక్ బీహార్లో హోమ్ రూల్ ఉద్యమాన్ని నిర్వహించడానికి సహాయం చేసారు  మరియు 1916 లో బీహార్ హోమ్ రూల్ ఉద్యమ అధ్యక్షుడిగా ఉన్నారు. చంపారన్ సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నoదుకు ఆయనకు  3 నెలల జైలు శిక్ష విధించబడింది.


నాన్-కోఆపరేషన్ మరియు ఖిలాఫత్ ఉద్యమ సమయం లో అయన తన లా ప్రాక్టిస్ ను మరియు  ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుని పదవిని వదులుకొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు మరియు సంపూర్ణ స్వాతంత్ర్యం "ప్రతి దేశం యొక్క జన్మహక్కు" అని గట్టిగా నమ్మారు.

మజారుల్ హక్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చారు  సరన్ జిల్లాలో పంచాయతీలను ఏర్పాటు చేశారు. బీహార్‌లో మెరుగైన విద్యా సౌకర్యాల కోసం, ముఖ్యంగా ఉచిత మరియు తప్పనిసరి ప్రాథమిక విద్య కోసం ఆయన చాలా కృషి చేసారు.

బీహార్‌లో ప్రారంభించిన పర్దా వ్యతిరేక ఉద్యమంలో మౌలానా మజారుల్ హక్ చురుకుగా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సమాజంలో మరింత చురుకైన పాత్ర వహించడానికి  మహాత్మా గాంధీ మహిళలను ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావాలని కోరారు. బీహార్‌లోని అనేక  ముస్లిం మరియు అనేక హిందూ కుటుంబాలలో పర్దా వ్యవస్థ అమలులో ఉన్నది మరియు మహిళలు జీవితంలోని అన్ని రంగాలలో పురుషుల వెనుకబడి  ఉన్నారు.

1919 లో విదేశీ వస్త్ర బహిష్కరణ లో భాగంగా మజారుల్ హక్ తన పాశ్చాత్య వేషధారణను విడనాడి సంప్రదాయ ముస్లిం వస్త్రధారణ ప్రారంభించారు. అతనికి "దేశ్ భూషణ్ ఫకీర్ మజారుల్ హక్" బిరుదు ఇవ్వబడింది.
సహకార ఉద్యమo భాగంగా  ప్రభుత్వ కళాశాలలను విడిచిపెట్టిన విద్యార్థుల కోసం కళాశాల నిర్మించటానికి ఆయన  1920, లో  పాట్నా-దనాపూర్ రహదారిపై తన 16 బిఘా భూమిని “సదాకత్ ఆశ్రమం” మరియు “విద్యా పీట్” కోసం విరాళంగా ఇచ్చారు. బీహార్‌లో స్వాతంత్ర్య ఉద్యమంలో సదాకత్ ఆశ్రమం ముఖ్యమైన పాత్ర పోషించింది.

మౌలానా ది మదర్ల్యాండ్అనే వార పత్రికను సదాకత్ ఆశ్రమం నుండి ప్రారంభించాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాసినందుకు  జైలు శిక్ష అనుభవించాడు. సదాకత్ ఆశ్రమం బీహార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతోంది.

మౌలానా హిందూ-ముస్లిం ఐక్యతను గట్టిగా విశ్వసించేవారు. " హిందూ లేదా ముసల్మాన్ కలసి ఒకే పడవలో ప్రయాణిస్తున్నారు, కలిసి ప్రయాణించాలి లేదా మునిగిపోవాలి" అనే వారు.

లండన్లో ఉన్నప్పుడు, మౌలానా అంజుమాన్ ఇస్లామియాను స్థాపించారు. ఇది లండన్ లో  వివిధ మతం, ప్రాంతం మరియు వర్గాలకు చెందిన భారతీయులను ఒకే ఛత్రం కిందకు తీసుకువచ్చింది. మహాత్మా గాంధీ మొట్టమొదట లండన్లోని అంజుమాన్ ఇస్లామియాలో మౌలానా మజారుల్ హక్ ను కలిశారు.

1926 లో మదర్సా మరియు మిడిల్ స్కూల్‌ను ఒకే క్యాంపస్ లో ప్రారంభించడానికి మౌలానా తాను జన్మించిన ఇంటిని విరాళంగా ఇచ్చాడు. రెండింటినీ ఒకే క్యాంపస్‌లో స్థాపించడం వెనుక ఉన్న ఆలోచన మత సామరస్యాన్ని పెంపొందించడం.

అతను జన్మించిన ప్రదేశం ప్రస్తుతం ప్రభుత్వ మిడిల్ స్కూల్  యొక్క ప్రధాన కార్యాలయం. ప్రధాన కార్యాలయం ప్రవేశ ద్వారం మీద, హిందీ లో జనమ్ కచ్ మౌలానా మజారుల్” (మౌలానా మజారుల్ హక్ జన్మస్థలం) అని వ్రాయబడింది.ఆయన జ్ఞాపకార్ధం ఆ ప్రదేశంలో లైబ్రరీ లేదా టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌ను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మౌలానా తన జీవితపు ప్రారంభ దశ నుండే మత సామరస్యం, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ మరియు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది అతని  దూరదృష్టిని తెల్పుతుంది.  బెంగాల్ నుండి బీహార్ ను విడదీసి ప్రత్యెక  రాష్ట్రాన్ని స్థాపించడంలో మౌలానా కృషి ఎంతో ఉంది. 

బీహార్ యొక్క దూరదృష్టి గల నాయకులలో ఒకరైన మౌలానా కు తగిన స్మారక చిహ్నం నిర్మించాలని వివిధ పక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు..

విచారకరమైన అంశం ఏమిటంటే  దేశo కోసం ఎంతో త్యాగం చేసిన మౌలానా కుటుంబం నేడు లేమిని అనుభవిస్తున్నది. స్వాతంత్య్ర సంగ్రామంలో తమ సర్వస్వం  త్యాగం చేసిన నాయకులు నేటి తరానికి గుర్తు లేరు. అది చాలా విచారకరం..

No comments:

Post a Comment