6 March 2020

తుర్రేబాజ్ ఖాన్/తురుం ఖాన్ Turrebaz Khan



Image result for turrebaz khan




ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ జ్వాలలు ఉత్తర భారతదేశంలో రగిలినప్పటికీ, అవి అక్కడికే పరిమితం కాలేదు. బానిస బంధనాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలని సమస్త భారత ప్రజానీకంలో ప్రగాఢమైన కాంక్ష పెల్లుబికినది.  బ్రిటీషర్ల తొత్తులైన రాజులు, నవాబులు, సంస్దానాధీశులు కూడా తిరుగుబాటును నిలువరించలేక పోయారు. ఉప్పెనలా ఉవ్వెత్తున బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకముగా ఎగిసిన పోరులో మరణం తధ్యమన్న చేదు నిజం తెలిసి కూడా పరాయిపాలకులను తరిమి కొట్టేందుకు విప్లవ  కారులు నడుం కట్టారు.
ఆ కోవకు చెందిన యోధులలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ ఒకరు.


తుర్రేబాజ్ ఖాన్ పూర్వపు హైదరాబాద్ జిల్లాలోని బేగం బజార్లో జన్మించాడు. పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు. తుర్రేబాజ్‌ పఠాన్‌ రుస్తుం ఖాన్‌ కుమారుడు. ఆయన బ్రిటిషు సైన్యంలో చేరి  ఔరంగాబాదు బ్రిటీష్‌ కంటోన్మెంటులో జమేదారుగా పనిచేశారు.

భారత దేశమంతటా తిరుగుబాటు బావుటాలు ఆకాశవీధుల్లో రెపరెలాడుతున్న రోజులవి. ధార్మిక పెద్దలు కూడా బ్రిటిషు పాలకుల నుండి మాతృగడ్డను విముక్తి చేయమని యవతీ యువకులను, భారతీయ సైనికులను, స్వదేశీ పాలకులను ప్రోత్సహిస్తున్న సమయంలో బానిసత్వం నుండి విముక్తికై పోరాడమని మౌల్వీ సయ్యద్‌ అల్లావుద్దీన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌కు ఉద్బోధించారు. ఫిరంగీలను హతమార్చమంటూహైదరాబాద్‌ నగరంలోని గోడల మీద ప్రకటనలు వెలువడ్డాయి.

బ్రిటీష్ వారు  న్యాయ విచారణ జరపకుండా ద్రోహం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న తన సహచరుడిని విడిపించేందుకు హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీపై (ఇప్పటి కోటిలో కల  మహిళా కళాశాల) పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ మౌల్వీ అల్లావుద్ధీన్‌ సహకారంతో  ఐదువందల మంది సాహసికులతో 1857 జూలై 17న  దాడి చేశాడు.

ఈ దాడిలో పలువురు సహచరులను కోల్పోయిన ఖాన్‌, బ్రిటీష్‌-నిజాం బలగాలకు 1857 జూలై 22న పట్టుబడ్డాడు. తిరుగుబాటుకు నాయకత్వం వహించి ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న నేరారోపణ విూద మౌల్వీ అల్లావుద్ధీన్‌ కు ద్వీపాంతరవాస శిక్షను విధించి, ఆయన యావదాస్తిని బ్రిటీష్‌ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. తుర్రేబాజ్‌ ఖాన్‌ను బందిఖానాలో నిర్బంధించారు.

సాహసవంతుడైన ఖాన్‌ 1859 జనవరి 18న జైలు నుండి తప్పించుకున్నారు. నిజాం ప్రభుత్వం తుర్రేబాజ్‌ ఖాన్‌ను సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టితెచ్చిన వారికి, 1859 జనవరి 19న అయిదు వేల రూపాయల నజరానాను ప్రకటించింది.

చివరకు నిజాం నవాబు ప్రకటిం చిన నగదు బహుమతికి ఆశపడిన కుర్‌బాన్‌ అలీ అను నమ్మకద్రోహి తుర్రేబాజ్‌ ఖాన్‌ ఆచూకిని నిజాం సైనికులకు చేరవేశాడు. బ్రిటీష్‌ బలగాలకు 1859 జనవరి 24న మెదక్‌ జిల్లా పరిసర ప్రాంతాలలోని తూఫ్రాన్‌ గ్రామం వద్ద తుర్రెబాజ్ ఖాన్ ఉన్నాడని తెలిసింది. బ్రిటీష్‌ సైన్యాలు, నిజాం బలగాలు తుర్రేబాజ్‌ ఖాన్‌ ఉంటున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆయనను నిరాయుధుడ్ని చేశాయి. శత్రువు కళ్ళుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదు. ఆ ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ను జనవరి 24న శత్రుసైనికులు కాల్చి చంపారు.

తుర్రేబాజ్‌ ఖాన్‌ మృతదేహాన్ని తూఫ్రాన్‌ నుండి హైదరాబాదుకు తరలించారు. ఆ తరువాత తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికకాయాన్ని సంకెళ్ళతో కట్టేసి హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం సుల్తాన్‌ బజారు పోలీసు స్టేషను‌ ఉన్న చోట బహిరంగంగా వేలాడదీసారు.

పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ భౌతికకాయం పట్ల కూడా ఆంగ్లేయులు, ఆంగ్లేయుల తొత్తులు కిరాతకంగా, అవమానకరంగా వ్యవహరించారు.

తుర్రేబాజ్ ఖాన్ కీర్తి

·        తుర్రేబాజ్ ఖాన్ దక్కన్ చరిత్రలో ఒక వీరోచిత వ్యక్తి, అతని శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచాడు. హైదరాబాద్ జానపద కథలలో - తురం ఖాన్”. అనే సానుకూలమైన యాస ఉంది.

·        'హైదరాబాద్ హీరో' - తుర్రేబాజ్ ఖాన్ యొక్క వీరోచిత సమర గాధను డాక్టర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, తిరుపతిలోని ఎస్.వి. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి (రిటైర్డ్) తన ‘Uprising of 1857: A movement that defined India of August 15, 1947’. ' గ్రంధం లో వివరించారు.


·        నిజాం భారీ అప్పుల్లో ఉన్నప్పుడు మరియు బ్రిటిష్ వారు క్రమంగా  శక్తివంతులు అవుతున్నప్పుడు తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వం లో నగరంలోని సాధారణ ముస్లింలు బ్రిటిష్ వారిపై దాడి చేశారు మరియు వారు ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలను కోల్పోయ్యారు. "తురం ఖాన్ తిరుగు బాటు ప్రభువుల లేదా నిజాం తిరుగుబాటు గా కాక సామాన్యుల తిరుగుబాటుగా  గుర్తించబడటం జరిగిందని అని హైదరాబాద్ విశ్వవిద్యాలయం చరిత్ర యొక్క రిటైర్డ్ హేడ్ ప్రొఫెసర్ కెఎస్ఎస్ శేషన్ వివరించారు..


తుర్రేబాజ్ స్మారకం

·        పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌ తదితర యోధులు బ్రిటీషు రెసిడెన్సీ భవంతి విూద జరిగిన దాడి సంఘటనలకు గుర్తుగా, ఆ నాటి వీరయోధుల స్మారకార్థంహైదరాబాదు నగరం నడి బొడ్డున గల కోటిలోని సిటీ బస్టాండు వద్ద (అది అనాటి రెసిడెన్సీ ప్రాంతం) స్వతంత్ర భారత ప్రభుత్వం 1957లో ఓ స్మారక స్థూపాన్ని నిర్మించింది.

·        గ్రానైట్‌ స్తంభం, దాని నాలుగు దిశలా పహరా కాస్తున్నట్టుగా ఉన్న నాలుగు ఏనుగుల శిలా విగ్రహాలతో చక్కని స్మారక చిహ్నాం ఏర్పాటయ్యింది.

·        బేగం బజార్‌లో ఒక వీధికి అతని పేరు పెట్టారు.



No comments:

Post a Comment