26 August 2022

సయ్యద్ హసన్ ఇమామ్, భారతదేశపు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు1871-1933

 

సయ్యద్ హసన్ ఇమామ్ 1871 ఆగస్టు 31న పాట్నా జిల్లాలోని న్యూరా గ్రామంలో జన్మించారు. సయ్యద్ హసన్ ఇమామ్ తండ్రి పేరు సయ్యద్ ఇమ్దాద్ ఇమామ్ మరియు అన్నయ్య పేరు సర్ అలీ ఇమామ్. TK ఘోష్ అకాడమీ నుండి ప్రారంభ విద్యను పూర్తి చేసిన తర్వాత, సయ్యద్ హసన్ ఇమామ్ పాట్నా కాలేజియేట్ స్కూల్‌లో చేరాడు. అక్కడ  అనారోగ్యo కారణంగా  మెడికల్ సలహాపై ఆరా లోని ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. అక్కడ సయ్యద్ హసన్ ఇమామ్ సచ్చిదానంద్ సిన్హాను కలిశారు. కొన్ని రోజుల తరువాత, 1887లో, సయ్యద్ హసన్ ఇమామ్ తిరిగి పాట్నాకు వచ్చి కాలేజియేట్ స్కూల్‌లో తిరిగి చేరాడు. సయ్యద్ హసన్ ఇమామ్ కు ఇంగ్లీషు భాషపై మంచి పట్టు ఉన్న కారణంగా  ప్రిన్సిపాల్ అతనిని పాట్నా కళాశాల డిబేటింగ్ సొసైటీలో పాల్గొనమని ప్రోత్సహించాడు.

హసన్ ఇమామ్ 24 జూలై 1889న న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లండ్‌లోని మిడిల్ టెంపుల్‌కి వెళ్లాడు. అక్కడ లైబ్రరీలో  పుస్తకాలు  చదువుతూ ఎక్కువ సమయం గడిపెవారు. ఈ సమయంలో సచ్చిదానంద్ సిన్హా కూడా లా చదవడానికి ఇంగ్లండ్ వచ్చారు. ఇద్దరూ రూమ్-మేట్స్ మాత్రమే కాదు; లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో ప్రొఫెసర్ హెన్రీ చరిత్ర ఉపన్యాసాలకు కూడా హాజరు అయ్యే వారు.

హసన్ ఇమామ్,  దాదాభాయ్ నౌరోజీ నేతృత్వం వహించిన  ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క కార్యదర్శిగా పనిచేసారు. హసన్ ఇమామ్,  మజరుల్ హక్ స్థాపించిన లండన్‌లోని  అంజుమన్ ఇస్లామియా అనే ఈ సంస్థకు కార్యదర్శిగా కూడా ఉన్నారు. విలియం డిగ్బే వేల్స్‌ను సందర్శించినప్పుడు, హసన్ ఇమామ్,  విలియం డిగ్బే వ్యక్తిగత కార్యదర్శిగా చాలా నెలలు పనిచేసారు.

1891లో బ్రిటిష్ పార్లమెంట్ కు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దాదాభాయ్ నైరోజీ విజయంలో హసన్ ఇమామ్ ముఖ్యమైన పాత్ర పోషించారు మరియు 1892లో భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు కలకత్తా హైకోర్టులో ఎన్రోల్  తర్వాత పాట్నాలో నివసించడం ప్రారంభించారు. త్వరలో హసన్ ఇమామ్ చాలా ప్రసిద్ధ న్యాయవాదిగా పరిగణించబడ్డాడు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో  కేసులపై వాదించాలని హసన్ ఇమామ్ కు పిలుపులు వచ్చేవి.  

హసన్ ఇమామ్ పాట్నా మునిసిపాలిటీ మరియు జిల్లా బోర్డు సభ్యుడు కూడా. 1910లో హసన్ ఇమామ్,  పాట్నా నుండి కలకత్తాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. హసన్ ఇమామ్ సామర్థ్యాన్ని చూసి, అప్పటి బెంగాల్ ప్రధాన న్యాయమూర్తి లారెన్స్ జెంకిన్స్, న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించమని హసన్ ఇమామ్‌ను ఆహ్వానించారు; హసన్ ఇమామ్ ఏప్రిల్ 1911లో అంగీకరించాడు. హసన్ ఇమామ్ 5 మార్చి 1916 వరకు కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగాడు. హసన్ ఇమామ్ కలకత్తా నుండి పాట్నా హైకోర్టుకు బదిలీ చేయబోతున్నారు, అయితే బీహార్ గవర్నర్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు, అప్పుడు హసన్ ఇమామ్ రాజీనామా చేసి మళ్లీ న్యాయవాద వృత్తిని చేపట్టారు. పాట్నా హైకోర్టు 6 మార్చి 1916న స్థాపించబడింది మరియు అదే  రోజున హసన్ ఇమామ్ పాట్నా హై కోర్ట్ లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు; పాట్నా హై కోర్ట్ లో హసన్ ఇమామ్ ప్రాక్టీస్ అతని మరణం వరకు కొనసాగింది.

న్యాయవాద వృత్తి  ద్వారా, హసన్ ఇమామ్ చాలా కీర్తితో పాటు  చాలా డబ్బు సంపాదించాడు. హసన్ మంజిల్ మరియు రిజ్వాన్ కాజిల్” వంటి విలాసవంతమైన భవనాలను నిర్మించడమే కాకుండా, హసన్ ఇమామ్ అలీఘర్ మరియు బనారస్  లోని  ప్రసిద్ధ సంస్థలకు విరాళాలు ఇవ్వడం కొనసాగించాడు. పాట్న లోని బీఎన్ కాలేజీ కి ప్రతి ఏటా వెయ్యి రూపాయలు విరాళం ఇచ్చేవాడు మరియు  పేద విద్యార్థులకు ఆర్ధిక  సహాయం చేసేవాడు.

హసన్ ఇమామ్ 1903లో, బాద్షా నవాబ్ రిజ్వీ జనానా పాఠశాల స్థాపనలో ముఖ్యమైన పాత్ర పోషించాడు మరియు దాని కార్యదర్శి అయ్యాడు. హసన్ ఇమామ్ ప్రేరణతో, టెకారి మహారాజ్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని మహిళల విద్య కోసం ఏర్పరచిన  వక్ఫ్‌ కు ఇచ్చాడు.హసన్ ఇమామ్ టెకారీ బోర్డులో గౌరవనీయమైన సభ్యుడు అయ్యాడు; అలాగే బాలికల విద్య కోసం అనేక పథకాలను సూచించారు.

1911లో, హసన్ ఇమామ్ అలీఘర్ కాలేజీకి ట్రస్టీ అయ్యారు; మరియు దాని కోసం నిధులు సేకరణ నిమిత్తం, కమిటీని ఏర్పాటు చేసి బీహార్‌లోని చాలా పట్టణాలను సందర్శించారు.  బీహార్‌లోని విద్యావంతులు  'ది బిహారీ' అనే సంస్థను ఏర్పాటు చేసారు,  హసన్ ఇమామ్ దీనికి అధ్యక్షుడయ్యాడు.

హసన్ ఇమామ్ ప్రత్యేక బీహార్ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడారు. 1905లో బెంగాల్ రాష్ట్ర విభజనకు ప్రత్యేక బీహార్ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న చాలా మంది నాయకులు మద్దతు ఇచ్చారు; వారిలో హసన్ ఇమామ్ కూడా ఒకరు. 1906లో ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపించబడింది.  మజరుల్ హక్‌తో పాటు హసన్ ఇమామ్ కూడా అక్కడ ఉన్నారు.

హసన్ ఇమామ్ 1908లో, కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు మద్రాసు వెళ్ళాడు మరియు అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత, 1909లో సోనేపూర్‌లో బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని స్థాపించారు మరియు హసన్ ఇమామ్ దాని మొదటి అధ్యక్షుడయ్యాడు మరియు అదే సంవత్సరం నవంబర్‌లో గయాలో జరిగిన  బీహార్ స్టూడెంట్ కాంగ్రెస్  నాలుగో సమావేశానికి అధ్యక్షత వహించాడు.

1911 డిసెంబరులో, కలకత్తాలో కాంగ్రెస్ సమావేశం జరిగింది, హసన్ ఇమామ్ అందులో పాల్గొనడమే కాకుండా, తదుపరి సమావేశాన్ని బీహార్‌లో నిర్వహించడానికి ఆహ్వానం ఇచ్చారు. 1912లో, కాంగ్రెస్ సెషన్ బీహార్, బంకీపూర్‌లో జరిగింది, అందులో మునుపటి సెషన్‌ల కంటే ఎక్కువ మంది ముస్లింలు హాజరు అయ్యారు దీని ఖ్యాతి కూడా  హసన్ ఇమామ్ కు దక్కుతుంది.  

హసన్ ఇమామ్ 1916లో హోంరూల్ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నాడు. హసన్ ఇమామ్ 1917లో బీహార్ ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహించాడు మరియు గాంధీజీ 1917 ఏప్రిల్‌లో బీహార్‌కు వచ్చినప్పుడు, హసన్ ఇమామ్, గాంధీజీ కి  పూర్తి మద్దతు ఇచ్చారు.

1918 ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1 వరకు బొంబాయిలో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది, దీనికి సయ్యద్ హసన్ ఇమామ్ అధ్యక్షత వహించారు. 1918 సంవత్సరంలో, సెర్చ్‌-లైట్ అనే జాతీయవాద ఆంగ్ల వార్తాపత్రికను తీసుకురావడంలో హసన్ ఇమామ్ ముఖ్యమైన పాత్ర పోషించారు; ఈ వార్తాపత్రికకు మొదటి సంపాదకుడు సయ్యద్ హైదర్ హుస్సేన్.

6 ఏప్రిల్ 1919, రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పాట్నాలో భారీ సమ్మె జరిగింది, ఆ సమ్మె లో హిందూ-ముస్లిములు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు,  దుకాణదారుల నుండి రైతుల వరకు సమ్మెలో పాల్గొన్నారు. హసన్ ఇమామ్ అధ్యక్షతన ఖిలా మైదాన్‌లో పెద్ద పెద్ద నాయకులంతా సమావేశమయ్యారు.

1920లో, ఖిలాఫత్ మరియు సహకార ఉద్యమం లో హసన్ ఇమామ్  చురుకుగా పాల్గొన్నారు. 1921లో, ఖిలాఫత్ ఉద్యమాన్ని ఒక ముగింపుకు తీసుకురావడానికి హసన్ ఇమామ్ అధ్యక్షతన భారతీయుల ప్రతినిధి బృందం ఇంగ్లాండ్ వెళ్ళింది. సహకార ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేందుకు, ఎల్లప్పుడూ ఇంగ్లీష్ డ్రెస్ లో      ధరించే  హసన్ ఇమామ్ ఖాదీ దుస్తులు ధరించడం ప్రారంభించాడు.1921లో బీహార్ ఒరిస్సా లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యాడు మరియు దాని మొదటి ఎన్నికైన ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

1923లో, లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క నాల్గవ అసెంబ్లీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సయ్యద్ హసన్ ఇమామ్ జెనీవా వెళ్ళాడు. 1927లో బీహార్‌లో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అదే సమయంలో, సయ్యద్ హసన్ ఇమామ్ 1930 శాసనోల్లంఘన ఉద్యమంలో స్వయంగా పాల్గొనడమే కాకుండా, హసన్ ఇమామ్  భార్య మరియు కుమార్తె కూడా అందులో చురుకుగా పాల్గొన్నారు; వీరిపై బ్రిటిష్ వారు జరిమానా కూడా విధించారు. స్వదేశీ లీగ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

19 ఏప్రిల్ 1933, 62 సంవత్సరాల వయస్సులో, బీహార్‌లోని షహాబాద్ జిల్లాలోని జప్లా అనే గ్రామంలో సయ్యద్ హసన్ ఇమామ్ మరణించారు.

No comments:

Post a Comment