రాణి అబ్బక్క
చౌతా ప్రస్తుత దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ ప్రావిన్స్ నుండి వచ్చిన మొదటి
తుళువ రాణి. రాణి అబ్బక్క, పోర్చుగీస్ విదేశీ సైన్యానికి వ్యతిరేకంగా విభిన్న విశ్వాసాల ప్రజలను ఏకం చేసిన
శక్తిగా పేరుగాంచింది. రాణి అబ్బక్క, కోస్తా కర్ణాటకలోని
వ్యూహాత్మక ప్రాంతాలను కలిగి ఉన్న తుళునాడును పాలించిన చౌతా రాజవంశానికి
ప్రాతినిధ్యం వహించింది.
పోర్చుగీసు దళాలు గోవాలో తమ పాలనను స్థాపించిన
తర్వాత, మంగళూరు, ఉల్లాల్ ఓడరేవులను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించారు. భర్తను
విడిచిపెట్టి తిరిగి తండ్రి వద్దకు వచ్చిన వీర రాణి అబ్బక్క నాలుగు దశాబ్దాలపాటు
పోర్చుగీసు దాడులను తిప్పికొడుతూ సైన్యాన్ని ముందుండి నడిపించింది.
రాణి అబ్బక్క ధైర్యవంతురాలైన అగ్రశ్రేణి మహిళా యోధులలో ఒకరిగా పరిగణించబడుతుంది.
అబ్బక్క మేనమామ తిరుమలరాయ, అబ్బక్కను ఉల్లాల్ రాణిగా పట్టాభిషేకం చేశాడు. అబ్బక్క, లక్ష్మప్ప అరస బంగార్రాజుIIని వివాహం చేసుకుంది. అయితే వారి వివాహం చాలా కాలం కొనసాగలేదు దాoతో రాణి అబ్బక్క ఉల్లాల్ కు తిరిగి వచ్చింది
ఉల్లాల్, సంపన్నమైన ఓడరేవు మరియు సుగంధ ద్రవ్యాల
వ్యాపారానికి కేంద్రంగా ఉంది. దీనిపై పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటీష్ వారి ద్రుష్టి
పడింది. ఉల్లాల్ కైవసం చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న విదేశీ శక్తులను వ్యతిరేకంగా
స్థానిక పెద్దలు తమ బేధాలను విడిచి ఏకమయ్యారు.
రాణి అబ్బక్క, తన పాలన లో హిందువులు, జైనులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. 16వ శతాబ్దంలో రాణి అబ్బక్క పాలనలో, హిందువులు మరియు ముస్లింలు భుజం భుజం కలిపి నిలబడినందున, కర్ణాటక కోస్తా ప్రాంతం మొత్తం జాతి ఐక్యత మరియు సమగ్రతకు ఒక ఉదాహరణగా నిలిచింది.
రాణి అబ్బక్క యొక్క విడిపోయిన భర్త ఆమెపై తీవ్ర
పగ పెంచుకున్నాడు.
పోర్చుగీస్ వారు 1555 నుండి 1568 వరకు ఉల్లాల్‌పై దాడులు చేశారు.
ఉల్లాల్ పట్టుబడిన తరువాత, రాణి అబ్బక్క ఒక మసీదులో ఆశ్రయం
పొందింది. రాణి అబ్బక్క తన సైన్యo తో పోర్చుగీసు వారి పై దాడిని ప్రారంభించింది. రాణి
అబ్బక్క సైన్యం పరాక్రమంతో పోరాడి జనరల్ జోవో పీక్సోటోను చంపింది, ఆ తర్వాత పోర్చుగీస్ వారు వెనక్కి
తగ్గవలసి వచ్చింది.
రాణి అబ్బక్క బీజాపూర్ సుల్తాన్ మరియు కాలికట్
(కేరళ) పాలకులతో మైత్రిని ఏర్పరచుకుంది. అయితే చివరకు రాణి అబ్బక్క ను పోర్చుగీస్ సైన్యం బంధించి
జైలుకు పంపింది.
రాణి అబ్బక్క జైలులో
కూడా తిరుగుబాటు చేసి పోరాడి మరణించిందని జానపద కథలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోని
ప్రసిద్ధ స్థానిక కళారూపమైన యక్షగానం ద్వారా ఆమె కథ చెప్పబడింది.
అబ్బక్క ధైర్యసాహసాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం
వీర రాణి అబ్బక్క ఉత్సవాన్ని నిర్వహిస్తారు మరియు అబ్బక్క పేరు మీద అవార్డులు
అందజేస్తారు. 2003లో భారత తపాలా శాఖ రాణి అబ్బక్కపై
ప్రత్యేక కవర్‌ను జారీ చేసింది. దివంగత అబ్బక్క రాణి కాంస్య విగ్రహాలు ఉల్లాల్
మరియు బెంగళూరులో స్థాపించబడ్డాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGSకి రాణి అబ్బక్క పేరు పెట్టారు.
ప్రస్తుతం హిందూ-ముస్లిం ఘర్షణలతో వార్తల్లో
నిలుస్తున్న కర్నాటక ఒకప్పుడు ఏకమై విదేశీ ఆక్రమిత శక్తుల దాడులను
తిప్పికొట్టింది. హిందువులు, ముస్లింలు మరియు జైనులు ఐక్యంగా
ఉన్నందున విదేశీ శత్రువులు స్థానిక రాజ్యాలను నాశనం చేయలేకపోయారు. ఉమ్మడి
శత్రువుపై భిన్న విశ్వాసాల ప్రజలు ఏకమయ్యే రోజు కోసం దేశభక్తులు ఇంకా
ఎదురుచూస్తూనే ఉన్నారు.
No comments:
Post a Comment